Wednesday, April 28, 2010

కాశీ యాత్ర ఫోటోలు

మా కాశీ యాత్ర ఫోటోలు కొన్ని బుక్స్ అండ్ గల్ ఫ్రెండ్స్ లో పబ్లిష్ అయ్యాయి ఇవాళ.  మీ కోసం ఆ లింకు

http://booksandgalfriends.blogspot.com/2010/04/blog-post_28.html

Sunday, April 25, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు—6




విశ్వేశ్వరునికి నిత్య హారతులు

శ్రీ కాశీ విశ్వనాధుని ఆలయంలో స్వామికి నిత్య హారతులు మూడు.  తెల్లవారుఝామున 3గంటలనుంచి 4గంటల మధ్య ఇచ్చే హారతి మొదటిది. దీనికి టికెట్ వున్నది. ఇది మేము చూడలేదు.  కనుక  వివరించలేను.  కానీ ఈ హారతిలో మణికర్ణిక ఘాట్ నుంచి శవం భస్మం తీసుకు వచ్చి అభిషేకం చేస్తారని అన్నారు.  ఇలా ఉజ్జయినిలో చేస్తారు.  మేము చూశాము.

ఇంక రెండవది సప్త ఋషి హారతి.  ఇది సాయంకాలం 7 గంటల ప్రాంతంలో వుంటుంది.  టికెట్ 51 రూపాయలు.  హారతి మొదలు పెట్టే ముందు టికెట్ లేని వాళ్ళని బయటకి పంపుతారు కానీ, మొదలు కాగానే అందరూ వస్తారు.  టికెట్ వున్న వాళ్ళని 4 గుమ్మాల దగ్గర నాలుగు బల్లలు వేసి, గుమ్మంలోనూ, వాటిమీదా కూర్చోబెడతారు.  గుమ్మంలోనో, బెంచీ మీద మధ్యలోనో కూర్చున్నవారు అదృష్టవంతులు.  మిగతావారికి అన్నివైపులనుంచీ తోపుళ్ళు తప్పవు.

ఈ సప్త ఋషి హారతిలో సప్త ఋషులకు ప్రతినిధులుగా ఏడుగురు పండితులు స్వామికి అభిషేకం, అర్చన చేసి హారతి ఇస్తారు.  ఈ హారతి సమయంలో అందరూ గంటలు ఎంత  లయ బధ్ధంగా  వాయిస్తారంటే, మనం కొంచెం మనసు లగ్నం చేస్తే  ఆ పరమ శివుని ఆనంద తాండవం కళ్ళముందు గోచరిస్తుంది.  అంత తన్మయత్వంలో మునుగుతాము.  ఆ అపురూపమైన అనుభవాన్ని కాశీకి వెళ్ళినవాళ్ళెవరూ వదులుకోవద్దు.  అది అనుభవించవలసినదే.

హారతి పూర్తి అయిన తర్వాత ఆ పండితులంతా నాలుగు వైపులకూ వచ్చి, స్వామికి వేసిన  పూల మాలలు, తీర్ధం  బయట వున్న భక్తులకందరికీ ఇస్తారు.

దీని తర్వాత రాత్రి 8 గంటలు దాటిన తర్వాత సేజ్ హారతి వుంటుంది.  ఈ రెండు హారతుల మధ్యా, రాత్రి హారతి తర్వాత 11 గంటలదాకా స్వామి దర్శనం వుంటుంది.  హారతుల సమయంలో లోపలికి ఎవరినీ వెళ్ళనివ్వరు.

ఈ హారతిలో కూడా స్వామికి అభిషేకం, పూజ అంటే మంత్రాలు చదువుతూ పూల మాలలు అలంకరించటం ఎక్కువసేపు వుంటుంది.  హారతి సప్త  ఋషి హారతి అంత ప్రభావితంగా వుండదు.  కానీ ఇదీ చూడదగ్గదు.  దీనికీ టికెట్ 51 రూపాయలు.

ఈ హారతి తర్వాత కూడా బయట తీర్ధం, హారతి సమయంలో స్వామికి నివేదించిన ప్రసాదం  భక్తులందరికీ ఇస్తారు.

వచ్చే పోస్టులో ప్రయాగ త్రివేణీ సంగమలో వేణీదానం వివరాలు.

Tuesday, April 20, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు---5



పూజా కార్యక్రమాలు

కాశీ గురించిగానీ, కాశీలో దేనిగురించిగానీ విమర్శించకూడదు, అలా విమర్శిస్తే శివునికి కోపకారకులమవుతామంటారు.  నేను చూసింది చూసినట్లు చెబితే ఇది చదివి వెళ్ళేవాళ్ళు జాగ్రత్త పడతారు అనే వుద్దేశ్యంతో నేను వివరంగా చెబుతున్నాను.

కాశీ విశ్వనాధుని ఆలయం చిన్నది.  అందులో గర్భ గుడి ఇంకా చిన్నది.  నాలుగు వైపులా ద్వారాలు.  రెండు ద్వారాలు లోపలకి వెళ్ళటానికి, రెండు ద్వారాలు బయటకి రావటానికే కాదు, అస్మదీయులు, పూజారులు తీసుకుని వచ్చే అభిషేకం చేసుకునేవారు లోపలకు వెళ్ళటానికి కూడా వుపయోగ పడతాయి.  గర్భగుడి షుమారు 10 x 10 వైశాల్యం వుంటుంది.  గర్భ గుడిలో ఒక మూలకి వున్నట్లు వుంటుంది లింగం.  దాదాపు నేలకి సమానంగా, చతురస్రాకారం, మధ్యలో గుంట, అందులో లింగం.  గుమ్మందాకా క్యూ వుంటుందిగానీ గుమ్మందగ్గరనుంచి బలవంతులదే రాజ్యం. 

తెల్లవారుఝామున 3 గంటలనుంచి 4 గంటలదాకా హారతి వుంటుంది.  దీనికి టికెట్ వుంది.  4 గంటలనుంచీ రాత్రి 11 గంటలదాకా అభిషేకాలు, దర్శనం వుంటుంది.  భక్తులందరూ జిల్లేడు పూల మాలలు, మారేడు దళాలు, పూలు, అభీషేక ద్రవ్యాలు తీసుకువచ్చి స్వహస్తాలతో స్వామికి సమర్పిస్తారు.  అక్కడ పూజారి వుండి ఆయన ద్వారా పూజలు జరగటం వుండదు.  మనం తీసుకెళ్ళిన ద్రవ్యాలను మనమే స్వామికి స్వయంగా సమర్పించవచ్చు, స్వామిని తాకి నమస్కరించవచ్చు.  అభిషేకం కూడా మనం తీసుకెళ్ళిన నీళ్ళో, పాలో, స్వామికి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు.  ఆ తోపుడులో మీ మనసులో మీరనుకున్నదే మంత్రం.

అదే పూజారి ద్వారా వెళ్తే 501 రూ.  చెల్లించాలి.  అవసరమైన ద్రవ్యాలు వాళ్ళే ఇస్తారు.  లోపల ఖాళీ వుంటే కూర్చుని అభిషేకం చెయ్యవచ్చు.  లేదంటే బయటే సంకల్పం చెప్పి లోపల రెండు నిముషాలలో పూజారిచ్చిన ద్రవ్యాలు స్వామికి సమర్పించి బయటపడాలి.  మనం ఏ ద్రవ్యాలతో పూజ చేస్తున్నామో కూడా తెలుసుకునేంత తెరిపి వుండదు.

మేము రెండు సార్లు అభిషేకం చేయించాము.  ఒకసారి మహారాష్ట్ర బ్రాహ్మణుడు.  లోపల రష్ గా వుందని బయట ఆవరణలోనే కూర్చోబెట్టి రుద్రం చదివి, తర్వాత లోపల 2 నిముషాలు చేయించారు.  అక్కడ మాకు తృప్తిగా లేదనుకున్నారేమో, విశాలాక్షి అమ్మవారి దగ్గర శ్రీ చక్రానికి కూడా ఆయనే శ్రీ సూక్తంతో యధావిధిగా కుంకుమ పూజ చేయించారు.  అప్పటికింకా జనాలు మొదలు కాలేదు ప్రశాంతంగా చేసుకున్నా.  చాలా సంతోషం అనిపించింది.  అంతకన్నా సంతోషకరమైన విషయం సరిగ్గా పూజ పూర్తయ్యే సమయానికి ఎవరో ఒకావిడ నా ప్రక్కనే నుంచుని మా అమ్మ ఎప్పుడూ పాడే,  రాజ రాజేశ్వరి, దేవి కన్యాకుమారి, రక్షించు జగదీశ్వరీ అనే పాట పాడటంతో మనసంతా తృప్తితో నిండిపోయింది.  మా పిన్ని అయితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంది మీ అమ్మే వచ్చి పాడినట్లనిపించిందే అని.

రెండవసారి తెలుగు పురోహితుల ద్వారా అభిషేకానికి ఏర్పాటు చేసుకున్నాము.  ఆ రోజూ విపరీతమైన జనం వున్నారు.  బయట ఏమీ  పెద్దగా చేయించలేదు.  లోపల తోపులాటలో ఏం చేయించారో తెలియలేదు.  చాలా అసంతృప్తిగా అనిపించింది.

ఒక రోజు అన్నపూర్ణ ఆలయంలో కుంకుమ పూజ చేసుకున్నాను.  జనం వున్నా పూజ బాగానే చేయించారు.  మంత్రాలు చెప్పటంలో మధ్యలో అనేక అవరోధాలు వున్నా, భక్తి వుండాల్సింది మనకీ, పూజారికి కాదు అని సర్ది చెప్పుకున్నాము. 

పూజారుల ద్వారా పూజలని సమయం వృధా చేసుకునే బదులు ప్రశాంతంగా దైవనామ స్మరణ చేస్తే మనశ్శాంతి అనే నిర్ణయానికొచ్చేశాము.

కిందటేడు ఇదే సమయంలో మా వాళ్ళెళ్ళొచ్చారు.  వాళ్ళు తెల్లవారుఝామున 4 గంటల కెళ్తే కూర్చుని అభిషేకం చేసుకున్నామన్నారుగానీ మేము వెళ్ళినప్పుడు ఆ సమయంలోకూడా జనం ఎక్కువగానే వున్నారు.

కాశీ పవిత్ర క్షేత్రమనే భావన ప్రతి భారతీయుని నర నరాన జీర్ణించుకు పోతుంది కనుక ఈ అసంతృప్తులన్నీ గంగా ప్రవాహంలో గడ్డిపోచలాగా కొట్టుకుపోనిచ్చి మనసు భగవంతుని మీద కేంద్రీకరించగలిగితే అదృష్టవంతులం.

తదుపరి పోస్టులో  కాశీ విశ్వనాధుని హారతులు.

 కాశీ విశ్వనాధుని ఆలయం




 


Saturday, April 17, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు—4



శ్రీ కేదార్ మందిరము

సాయంత్రం ఆంధ్ర ఆశ్రమానికి వెళ్ళి చూసి వద్దామనుకున్నాం, కానీ అది చాలా దూరం, నడిచే వెళ్ళాలి అనేసరికి ఆ ప్రోగ్రామ్ మానుకుని రెండు రోడ్లు తిరిగి వద్దామని బయల్దేరాం.  త్రోవలో లస్సి త్రాగేసరికి కాశీలో రోడ్లంబడ తిరగటమేమిటి కేదార్ మందిరం దగ్గరయితే వెళ్ళొద్దామనుకుని అక్కడవారిని అడిగాము.  ఈ దోవలో వెళ్ళచ్చు, పది నిముషాలు నడక అన్నారు.  ఇక బయల్దేరాము.  దోవలో అన్నీ చూసుకుంటూ, ఎంత నడిచినా, ఇక్కడే పది నిముషాల్లో వెళ్ళొచ్చు సమాధానం మారలేదు.  దోవలో ఇంకో మూడు దేవాలయాలు, కరివెన వారి సత్రం చూశాం.  (ఆ దగ్గలవోనే ఆంధ్రా సత్రంట తర్వాత తెలిసింది.)  ఆ వివరాలు. 

నడక మొదట్లోనే శ్రీ చిమలేశ్వర్ మహాదేవ్ మందిరం.  ఈ మందిరాన్ని 1808లో నిర్మించారు.  దాదాపు పది సంవత్సరాల క్రితం పాలరాతితో పునర్నిర్మించారు.  సన్నగా, పొడుగ్గా వున్న ఈ మందిరం అందంగా,  ప్రశాంతంగా వున్నది.  మందిరంలోకి వెళ్ళగానే మొదట్లో చిన్న గుంటలావుండి అందులో రెండు శివలింగాలుంటాయి.  ధర్శనం చేసుకుని ముందుకు వెళ్తే గర్భగుడిలో చిమలేశ్వర్ మహాదేవ్, అమ్మవార్ల విగ్రహాలు, చిన్న శివలింగం దర్శనమిస్తాయి.

అక్కడనుంచి ఇంకొంచెం ముందుకు సాగితే పాండేఘాట్లో తారాదేవి కాళీదేవి మందిర్ అనే బోర్డు చూసి లోపలకెళ్ళాం.  ఎఱ్ఱని రంగు గోడలతో 350 ఏళ్ళ క్రితం నిర్మించబడ్డ దేవాలయం ఇది.  బెంగాల్ నెటోర్ రాణి రాణీ భవానీ దేవి కట్టించారు.  వీరివి ఇంకా చాలా ఛారిటబుల్ ట్రస్టులున్నాయి.

తర్వాత రామ్ గులాలేశ్వర్ మహదేవ్ ఆలయం  గుడి చిన్నదయినా జేగురు రంగుతో అందంగా వున్నది.  పెద్ద శివ లింగం.  మేము వెళ్ళేసరికి చీకటి  పడుతోంది.  ఆలయ నిర్మాతల పేర్లు వగైరా లోపల బోర్డులున్నాయిటగానీ చీకట్లో కనిపించలేదు.  ఆలయం ముందు బోర్డు బెంగాలీలో వుంది.  పక్క షాపులో వ్యాపారి ఈ మాత్రం వివరాలు ఇచ్చారు.

ఈ ఆలయానికి ఎదురుగానే కరివెనవారి సత్రం.  అక్కడ తెలిసినవారిని పలకరించటానికి మా పిన్ని వెళ్ళి వచ్చే లోపల ఆలయం బయట అరుగు మీద కూర్చున్నాం.  నాకు సంతోషం కలిగించే విశేషం.  అక్కడ ఒక జంట పరిచయమయ్యారు.  వారు మాకన్నా ఎక్కువగా ఎన్నో యాత్రలు చేస్తున్నారు.  మాకూ ఆ అలవాటున్నదంటే అది చూశారా, ఇది చూశారా అంటూ ఎన్నో చెప్పారు..కొన్నింటి పేర్లుకూడా వినలేదు నేను.  ఎంత వెనకబడి వున్నానో అనిపించింది. 

అక్కడనుండి నెమ్మదిగా కేదారేశ్వర్ ఆలయం చేరాం.  ఆలయం విశాలంగా, బాగుంటుంది.   ఇక్కడ ఘాట్ ని కేదార్ ఘాట్ అంటారు.  ఆలయం వెనుక గంగ ఒడ్డుకి వెళ్తే  ఆలయాన్ని ఆనుకుని వున్న ఉపాలయంలో పెద్ద శివలింగం హరిశ్చంద్ర ప్రతిష్ట అని చెప్తారు.  ఇక్కడనుంచి హరిశ్చంద్ర ఘాట్ లో (పక్కనే వున్నది) శవాలు కాలటం కనబడుతుంది.

అక్కడనుంచి ఇంక అడుగు వేసే ఓపిక లేక పోయింది.  నడిచీ నడిచీ అంత అలిసిపోయాము.  కొంచెం దూరం నడిచి ఎలాగో ఒక ఆటోలో వేరే  దోవలో సత్రం చేరాం.

వచ్చే పోస్టులో కాశీ విశ్వనాధునికి అభిషేకాలు.

 పై రెండు ఫోటోలూ శ్రీ చిమలేశ్వర్ మహాదేవ్ మందిర్ వి
రామ్ గులాలేశ్వర్ మహాదేవ్ మందిర్

 హరిశ్చంద్ర ప్రతిష్టిత లింగం































Thursday, April 15, 2010

కాశీ యాత్ర మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు---3



గంగా స్నానం

ఉదయం 5 గం. కల్లా  గంగాస్నానానికి బయల్దేరాము.  సుప్రసిధ్ధ దశాశ్వమేధ ఘాట్ కి పది నిముషాల నడక.  గంగ ఒడ్డుకి చేరాం.  ఈ ఒడ్డున జనం ఎక్కువ వున్నారు.  బోటు వాళ్ళ హడావిడి.  గంగ మధ్యలో ఇసుక మేట వేసి వుంది.  కొంతమంది బోట్ లో అక్కడదాకా వెళ్ళి అక్కడ స్నానం చేస్తున్నారు.  ఈ గందరగోళంలోకన్నా మధ్యదాకా వెళ్ళి అక్కడ  స్నానం చేద్దామనిపించింది.  బోటులో అక్కడ దాకా  తీసుకెళ్ళి, దగ్గర దగ్గర ఒక గంట అక్కడ ఆగి, తిరిగి ఈ ఒడ్డుకి చేర్చటానికి మనిషికి 20 రూపాయలు తీసుకున్నాడు .  అక్కడ కూడా నీళ్ళు కలుషితంగానే అనిపించాయి.  కానీ ఆ బోటు అతను, మా సత్రం లోను చెప్పారు నీళ్ళు అలా కనిపించినా చాలా స్వఛ్ఛమైనవి, చేతిలోకి తీసుకుని చూడండి.  దేన్లోనన్నా పట్టి చూడండి ఏమైనా వైరస్ వగైరా వుంటుందేమో చెక్ చేసుకోండి అని నీళ్ళు మంచివని ఘట్టిగా చెప్పారు.  ఏదైనా ఇంత దూరం వచ్చి గంగ స్నానం చెయ్యకుండానా....సెంటిమెంటొకటి.  సరే స్నానం చేశాం. 

ఇక్కడ బయల్దేరేముందన్నారు..పెద్ద నదుల్లో స్నానం చేసేటప్పుడ ఆ చీరె నదిలో వదిలి పెట్టాలని.  మా పెద్దవాళ్ళెవరూ చెప్పకపోయినా చేస్తే పోలా అనిపించి ఆ పనీ చేశాం.  చక్కగా పడవతను అన్నీ తీసుకుని దాచుకున్నాడు.  పోనీలే ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయని సంతోషించాం.  అక్కడ ఫోటోగ్రాఫర్ రెడీగా వున్నాడు.  ఘాట్ కూడా వచ్చేటట్లు ఫోటో తీసి కాపీ వెంటనే ఇచ్చేస్తానన్నాడు.  ఒక్కో ఫోటోకి 20 రూపాయలు.  తీయించుకున్నాం.  ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళి గంగ నీరు నింపుకుని అక్కడనుండీ  విశ్వనాధుని గుడికి బయల్దేరాము.

పడవ దిగి ఘాట్ లో మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చేసరికి కొంచెం అలసట అనిపించింది.  వేడి వేడి పాలు తాగి గుడికి బయల్దేరాము.  సన్నటి సందులగుండా అడుగుతూ అడుగుతూ మొత్తానికి చేరాం కాశీ విశ్వనాధుని ఆలయం...ఎన్నాళ్ళనుంచో చూడాలని తపించిన ఆలయం...అతి పురాతన నగరంలోని  విశ్వ విఖ్యాతి చెందిన ఆ విశ్వేశ్వరుని ఆలయం దగ్గరలో
 కనీసం రెండు చోట్ల సెక్యూరిటీ చెక్ వుంటుంది.  సెల్ ఫోన్లు, కెమేరాలు తీసుకెళ్తే తప్పనిసరిగా బయట షాపులో లాకర్ లో పెట్టి వెళ్ళాలి, అలా పెడితే ధ్యాస వాటిమీదే వుంటుంది, అవి తీసుకెళ్ళద్దని మాకు హైదరాబాదులోనే సలహాలొచ్చాయి.  సలహాని పాటించి, ఇచ్చినందుకు వారికి, పాటించినందుకు మాకు శబాష్ చెప్పుకున్నాం.  పెన్నులు కూడా తీసుకెళ్ళద్దు.  మా పిన్నికి సెంటిమెంట్ వున్న ఒక పెన్ను లోపలకి తీసుకువెళ్ళనియ్యకుండా సెక్యూరిటీ వారి దగ్గర పెట్టుకుని తర్వాత ఇవ్వలేదు.  పిన్ని ఒక పెన్ను చూసి తనదేమోనని చూడబోతుంటే, ఎప్పుడు పెట్టారు అని అడిగింది సెక్యూరిటీ లేడీ.  చెబితే, ఇది మీదికాదు, అప్పుడు నేను లేను, ఎవరికిచ్చావో వాళ్ళనే అడుగు, దిక్కున్న చోట చెప్పుకో పో టైపులో మాట్లాడింది చాలా దురుసుగా.  సెక్యూరిటీ వాళ్ళు డ్యూటీలు మారుతూ వుంటారుగా, ఎవరికిస్తే వాళ్ళనే అడగాలంటే ఎలా  పైగా కొత్త వూళ్లో కొత్త మనుష్యులని గుర్తు పెట్టుకోవటం కష్టంకదా.  ఆ స్ధలంలో వున్న సెక్యూరిటీ వాళ్ళు అని గుర్తుపెట్టుకుంటారుగానీ, వాళ్ళ మొహాలు, వాళ్ళ పేర్లు ఎంతమందికి గుర్తుంటాయి. 

ఈ చెక్ లు దాటుకుని వెళ్తే విశ్వనాధుని ఆలయం.  నా ఖ్యాతే విశ్వవిఖ్యాతి చెందిందిగానీ, నే వుండే స్ధలం మాత్రం ఇంతే అనే అమాయకుడు భోళా శంకరుడి గుడి చిన్నదే.  మేము తీసుకెళ్ళిన గంగ నీరు శివయ్యకి అభిషేకం చేసి తాకి నమస్కారం చేసుకున్నాము.  మొత్తానికి ఆ తోపులాటనుంచి బయటపడి ప్రక్కనే వున్న ఇంకొక శివాలయంలో (ఉపాలయం) కూడా నమస్కరించి బయట పది నిముషాలు కూర్చున్నాము. ఆ పది నిముషాలు కూడా రేపు చేయించబోయే అభిషేకం గురించి అక్కడ మహారాష్ట్ర బ్రాహ్మణునితో మాట్లాడటానికి తప్పనిసరిగా ఆగవలసి వచ్చింది కనుక వుండనిచ్చారు.    ప్రదేశం చిన్నదవటంతో లోపల ఎక్కువసేపు కూర్చోనివ్వరు. లోపల కూడా సెక్యూరిటీ చాలా వున్నది.  సాధన చేసేవారు, ధ్యానం చేసుకునేవారు ఈ గుళ్ళో చాలా ఎక్కువ వైబ్రేషన్స్ అనుభవించగలరు.

బయటకొచ్చి 1 కి.మీ దూరంలో వున్న విశాలాక్షి గుడికి నడిచాము.  ఆ సందుల్లో రిక్షాలు కూడా రాలేవు.  విశాలాక్షి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.  ఆలయం చిన్నదే.  అసలు విగ్రహానికి ముందు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.  ప్రతిష్టించిన విగ్రహం వెనకనుంచి వంగి చూడాలి ఒరిజనల్ అమ్మవారిని.  ముందు శ్రీ చక్రం ప్రతిష్టింపబడివుంది.  భక్తులు ఇక్కడ కుంకుమపూజ చేసుకోవచ్చు, అక్కడవున్న పండాకి 151 రూ. ఇస్తే పూజ రుసుంతో సహా  పూజా ద్రవ్యాలు వాళ్ళే ఇస్తారు.  20 రూ. ఇస్తే అమ్మవారి ఫోటో, కుంకుమ ఇస్తారు.

తర్వాత అన్నపూర్ణ తల్లి దర్శనానికి బయల్దేరాము.  ఎవరినడిగినా విశ్వనాధుడి గుళ్ళోనే వుందికదా అన్నారు. (గుడిలో ఉపాలయం వుంది).    చాలామంది అన్నపూర్ణా ట్రస్టుని చూపించారు.  చివరికి ఒక చీరెల షాపు ఏజెంటు వెంటబెట్టుకుని తీసుకెళ్ళి చూపించాడు.  సమయం ఉదయం 9-40 అయింది.  ఆయన తీసుకెళ్ళినదీ అన్నపూర్ణా ట్రస్టు వాళ్ళ భోజనశాలకే.  ఏం చెయ్యాలా అనుకుంటుండగానే, అక్కడున్నవాళ్ళు గుమ్మానికి అడ్డపెట్టే చిన్న గేటులాంటిది తీసి, మా పిన్నినీ నన్నూ చూసి కింద కూర్చోలేనివాళ్ళు ఇటురండి, కూర్చోగలిగినవాళ్ళు అటెళ్ళండని చూపించారు.  వెళ్ళాం.  అక్కడ మా ఆఫీసువాళ్ళు కనబడి పలకరించేలోపల వాళ్ళపని వాళ్ళు చేసేశారు.  అదేనండీ మమ్మల్నందర్నీ కూర్చోబెట్టి వడ్డించేశారు.  భోజనం ఎంత బాగున్నదంటే, భోంచెయ్యగానే మా అంతట మేమడిగి డొనేషన్ ఇచ్చి వచ్చాం,  అక్కడివాళ్ళెవరూ దాని గురించి చెప్పకపోయినా.  ఇంతకీ దాన్లోనే ఇంకో పక్క అన్నపూర్ణ ఆలయం అని తర్వాత తెలిసింది.  చూశారా, కాశీ చేరగానే అన్నపూర్ణమ్మ ఎలా ఆదరించి భోజనం పెట్టించిందో.  ఇక్కడ భోజన కార్యక్రమం ఉదయం 9 గంటలనుంచీ సాయంకాలం 4 గంటలదాకా.  తర్వాత వుండదు.

కానీ మా సత్రం వాళ్ళకి కోపం వచ్చింది మామీద.  వాళ్ళకి చెప్పకుండా బయట తిని వచ్చినందుకు.  కాశీలో మీ పేర్లతో అన్నం వృధా అయింది.  ఆ పాపం మీదేనన్నారు.  అక్కడికీ జరిగిందంతా చెప్పాము.  పొద్దున్న 9-30 కల్లా వెళ్ళి భోంచెయ్యంకదా అన్నా మళ్ళీ మళ్ళీ అనేసరికి కోపం వచ్చి గట్టిగా అన్నాను.  కావాలని చేసింది కాదు, పైగా మీకు చెప్పాలని మాకు తెలియదు.  ఇప్పుడే చెప్పారు.  తెలియక చేసినదానికి ఆ దేవుడు ఏ శిక్ష వేస్తే అది మేమే అనుభవిస్తాం, ఇంక ఈ విషయం గురించి మాట్లాడద్దు అని.  అప్పుడు వూరుకున్నారు.  కాశీలో మన సహనానికి పరీక్ష చాలా చోట్ల వుంటుంది.  దీంతో ఒక విషయం అర్ధమయివుంటుంది మీకు.  మీరు దిగిన సత్రంలో భోజన, ఫలహార సదుపాయం వుంటే మీరు అక్కడ తినేది లేనిది వారికి  ఏ రోజుకారోజు ముందు చెప్పి మీ పేర్లు రాయించుకోవాలి.

మధ్యాహ్నం కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం మళ్ళీ బయల్దేరాం.  సాయంకాలం చూసిన శ్రీ కేదారనాధ్ ఆలయం, ఇంకా కొన్ని విశేషాలు వచ్చే పోస్టులో. 

  కాశీ విశాలాక్షి

Sunday, April 11, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు--2




గంగ హారతి


 కాశీలో వీధులు చాలా సన్నగా వుంటాయి.  దానికి తోడు రోడ్డుకటూ ఇటూ షాపులు, కొనేవారు,  ఎప్పుడూ రద్దీగా వుంటాయి. ఆయాసం, జన సమ్మర్దం ఎక్కువ పడని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వుండాలి.   మనుషులు నడవటమే కష్టమయిన ఈ రోడ్లలో రిక్షాలు కొన్నిసార్లు దొరుకుతాయిగానీ ఆటోలకి ఆంక్షలున్నాయి.  కనుక మనం సమయానికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే నడకే ఉత్తమం.  (మేమున్న చోటునుంచీ  దేవాలయాలకీ, గంగ ఒడ్డుకీ మేము నడిచే వెళ్ళావాళ్ళం.).

మేము కాశీ శ్రీ రామ నవమి రోజు చేరాము.  అక్కడవాళ్ళు నవరాత్రులు చేస్తారు.  ఉత్సవాలు, ఊరేగింపులు ఎక్కువ.  భక్తులు ఊరేగింపులతో తెల్లవారుఝామునుంచే బృందాలుగా దైవ దర్శనానికి వస్తారు.  అలాంటి అనేక ఊరేగింపులను మా సత్రంలోంచే చూశాము  కాశీ విశ్వ నాధ దేవాలయ ప్రవేశ ద్వారం మా వీధిలోనే వుండటంతో.

రోజూ సాయంత్రం 7 గంటలకి దశాశ్వమేధఘాట్ లో రెండుచోట్ల గంగమ్మతల్లికి హారతి ఇస్తారు. గంగ ఒడ్డున మెట్లమీద నుంచీ, ఒక్కో చోటా 7గురు చొప్పున హారతి ఇస్తారు.  45 నిముషాలుపాటు సాగే ఈ హారతి దృశ్యం కన్నులపండుగగా వుంటుంది.  దీనిని చూడటానికి జనం తండోపతండాలుగా వస్తారు.  టూరిస్టులను ఆకర్షించటానికి  ఒక ప్రత్యేక సౌకర్యం.  బోట్ లో గంగలోంచి హారతి చూడవచ్చు.  రేటంటారా, బేరమాడటంలో మీ ప్రతిభ బయటపడేది ఇలాంటిచోట్లేనండీ.  ఒకళ్ళిద్దరున్నా ప్రత్యేక పడవకి రూ. 200 నుంచీ, హారతి మొదలయ్యే సమయానికి మనిషికి రూ. 20 చొప్పున కూడా ఎక్కించుకుంటారు.  హారతి జరిగినంతసేపూ పడవ కదలదు.  తర్వాత దానికీ కదలటం వచ్చని నిరూపించటానికి అలా తిప్పి తీసుకొస్తారు.  ఏదైనా పడవలోంచి హారతి ఎదురుగా చూడవచ్చు.  అదే మెట్ల మీదనుంచి అయితే వెనకనుంచో, పక్కనుంచో చూడాలి.

హారతి సమయంలో గంగ ఒడ్డున దీపాలకి గిరాకీ ఎక్కువ.  యాత్రీకులంతా మగ, ఆడ తేడాలేకుండా తాముకూడా ఒడ్డున అమ్మే పూలు, దీపాలు కొని గంగకి హారతి ఇవ్వటానికి ఉత్సాహ పడతారు.   దీపాల వెలుగులతో కళ కళలాడే ఆ సంబరం చూసి తీరాలి.

మేము హారతి సమయానికి ఒక బోటులో ఎక్కాము.  అందులో రామకృష్ణ మఠం స్వామి శారదాత్మానంద స్వామి వున్నారు.  శిష్యులతో కలిసి కాశీ యాత్రకి వచ్చారు.  వేరే ప్రదేశాలు కూడా చూసుకుంటా,  ఇక్కడనుండి కలకత్తాలోని బేలూరు రామకృష్ణ మఠం వారి ఈ యాత్రలో చివరి మజీలీ.

హారతి చివరలో పడవల్లో పిల్లలు రకరకాల పౌరాణిక వేషాలలో పడవలలో ఊరేగింపుగా వచ్చారు.  గంగమ్మ ఒళ్ళో ఆ ఊరేగింపు కూడా అందంగా వుంది.  శ్రీరామనవమి స్పెషల్ అనుకుంటా ఆ ఊరేగింపు, గంగ ఒడ్డున నాట్య ప్రదర్శనయ  అవ్వన్నీ చూసిన  తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ మా మజిలీ చేరాం.  సత్రంవాళ్ళు పెట్టిన వేడి వేడి రైస్ పొంగలి, వడ తిని విశ్రాంతి తీసుకున్నాం.

తర్వాత పోస్టులో గంగ స్నానం, విశ్వనాధ, విశాలాక్షి దర్శనం, అన్నపూర్ణమ్మతల్లి ఆదరం.

పడవలోనూ ఒడ్డుపైనా గంగ హారతి (ఆ అపురూప అందాన్ని నా కెమేరా బంధించలేకపోయింది.
గంగమ్మ తల్లికి పూలు, దీపారాధన

 స్వామి శారదాత్మానంద స్వామి, రామకృష్ణ మఠం తో

Friday, April 9, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు---1




కాశీ చేరాం.

పూర్వకాలంలో కాశీకి వెళ్ళటం కాటికి వెళ్ళటం సమానమనే వాళ్ళు.  ఈ నానుడి అలవాటయ్యే కాబోలు మనవాళ్ళు చాలామంది కాశీ వెళ్ళిరావటంకంటే అమెరికా వెళ్ళిరావటం సులువనుకుంటున్నారు.  అలాంటివాళ్ళంతా ఓస్ కాశీ ప్రయాణం అంటే ఇంతేనా వెళ్ళోచ్చేస్తే పోలా అనుకుంటారు ఇది చదివాక.  ఇంత గ్యారంటీ ఇచ్చానని మూటా మల్లే కట్టేయకండి...ముందు అక్కడి విశేషాలు తెలుసుకోండి.

కాశీ వెళ్ళటానికి, మరీ ఎండా, అతి వృష్టీ కాకుండా అనువైన  సమయం అక్టోబర్ నుంచీ ఏప్రిల్ దాకా.  మా ట్రిప్ మార్చి 23నుంచీ ఏప్రిల్ 3 దాకా.  ఈ సమయంలో అక్కడా ఎండలు బాగానే వున్నాయి.  తర్వాత మనం భరించలేనంత ఎండలు వుంటాయి.  ఎండలు మనకలవాటేకదా అని బయల్దేరిపోయారనుకోండి...ఏ ఎండలు ఎలా వుంటాయో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.  అంతే.  పైగా అక్కడ పవర్ కట్ కూడా చాలా ఎక్కువ.  దాదాపు పగలంతా పవర్ వుండదు.  మేమున్నచోట జనరేటర్ ద్వారా లైట్స్ మాత్రం వచ్చేవి.  పగలు సగం పైగా ఫాన్ వుండేది కాదు.  ఫైవ్ స్టార్ హోటల్స్ సంగతి నాకు తెలియదు.  కాశీలో అవ్వికూడా వున్నాయి.  నెట్ ద్వారా ముందే రిజర్వు చేసుకోవచ్చేమో చూసుకోండి. 

సరే కాశీ వెళ్ళటానికి పయాణ సాధనాలు మీ ఊరినుంచీ రైలు వుంటుంది చూడండి..  మేమయితే మాఊరు (హైదరాబాదు) నుంచీ మార్చి 23వ తారీకు ఉదయం 9-50 కి పాట్నా ఎక్సప్రెస్ ఎక్కాము.  దీనికి పీయన్బీఈ యస్ సీ ఎక్స్ప్రెస్ అని  అన్నీ పొడక్షరాలతోకూడా ఒక పేరు వుందికానీ పాట్నా ఎక్స్ప్రైస్ అంటే  సుభ్భరంగా అందరికీ తెలుస్తుంది కదా.  ఉదయం 10 గం. లకల్లా రైలు సికింద్రాబాద్ లో బయల్దేరింది.  కాజీపేట చేరేసరికి మధ్యాహ్నం 12 గంటలయింది.  అక్కడనుంచీ మా గ్రూప్ మిగతా సభ్యులు మాపిన్ని శ్రీమతి సావిత్రీ మౌళి, సత్యప్రభ, కుసుమ, శ్యామ్  కలిశారు.   మా ప్రయాణం సాగీ, సాగీ, సాగీ, మధ్యలో ఇంటినుంచీ తెచ్చుకున్న పులిహోరలూ, పెరుగన్నాలూ, చపాతీలూ, ఇంకా చాలా బోలెడు ఐటమ్స్ కి న్యాయం చేస్తూ, మర్నాడు సాయంకాలం 3 గం. లకు వారణాసి స్టేషన్ చేరాము.  29 గంటల ప్రయాణం. ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసిన వారణాసి గాలి తగలగానే ప్రయాణ బడలిక అంతా ఎగిరి పోయింది. 

సామానుతో బయటకు వచ్చి, ఒక్కో ఆటోకి 100 రూ. చొప్పున 2 ఆటోల్లో మా సామానుతో సహా ఎక్కి గడోలియాలోని శ్రీ సాయి విశ్వనాధ అన్నపూర్ణ సేవాసమితివారి సత్రం  కి చేరుకున్నాము.  సింపుల్ గా బనారస్ లాడ్జి అంటే చాలామందికి అర్ధమవుతుంది.  అందులో కొంత భాగం తీసుకుని ఈ సేవా సమితివారు నాలుగు నెలలక్రితం ఈ సత్రాన్ని ప్రారంభించారు.  మాకు తెలిసినవారు అంతకుముందు అక్కడ వుండి వచ్చారు.  బాగున్నదని చెప్పటంతో మా ప్రయాణం నిర్ణయమయిన రోజునుంచీ ఫోన్ చేస్తున్నాను రూమ్స్ కోసం.  మేనేజర్ శ్రీ రామకృష్ణ డోనర్స్ ఎవరన్నా వస్తే మీకివ్వలేము..కానీ చుట్టుప్రక్కల తెలిసిన సత్రాలుంటాయి కనుక మీ కిబ్బందిలేకుండా ఎక్కడన్నా రూమ్ ఏర్పాటు చేస్తాము...వారణాసి స్టేషన్ కి రాగానే ఫోన్ చెయ్యండి అన్నారు.  అలాగే ఫోన్ చేసి వెళ్ళగానే రూమ్ ఇచ్చి ఆయన మాట నిలుపుకున్నారు.  ఈ సత్రం కాశీ విశ్వనాధుని ఆలయానికి  దగ్గరలో వుంది.

కాశీలో వసతికి ఇబ్బంది లేదు.  అనేక సత్రాలు, హోటల్స్ వున్నాయి.  సత్రాలలో కూడా ఎటాచ్డ్ బాత్ రూమ్స్, ఎసీ రూమ్స్ వుంటాయి. సత్రాలని  ఫ్రీ అనుకునేరు. వాటికి అద్దెలు కూడా వుంటాయి.    మేమున్నది రెండు వరస గదులు, ప్రతి గదిలో రెండు బెడ్స్, కానీ ఒకే బాత్ రూమ్, రోజుకి అద్దె 500 రూ. లు.  పెద్ద వరండా.  అందులోనే భోజనాలు.  భోజనాలంటే గుర్తొచ్చింది.  ఇక్కడ చాలా సత్రాలలో మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫెన్ ఏర్పాట్లు వుంటాయి.  ఇవి ఉచితమేగానీ, కాశీలో అన్నదాన మహాత్యాన్ని గురించి కొన్నిచోట్ల  ఊదరగొడుతూ వుంటారు.  అర్ధమయిందిగా.  మేమున్న సత్రంలో రూ. 1516 ఇస్తే సంవత్సరంలో మనం కోరుకున్న ఒక రోజు మనమేపేరు చెప్తే ఆపేరుతో అన్నదానం జరుగుతుంది.  ఆ రోజు దాతలు చాలామంది వుండవచ్చు...వుండాలి కూడా..ఎందుకంటే మాసత్రంలో కొన్ని రోజులు రోజుకి 200, 300 మంది పైన భోజనం చేశారు.  అలాంటప్పుడు అంతమందికి భోజనం పెట్టటానికి డబ్బు సరిపోవాలికదా.  పెద్ద గ్రూప్స్ వచ్చినప్పుడు  మనకి ఆ హడావిడి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చుగానీ ఊళ్ళనుంచి వచ్చిన గ్రూప్స్ అంతా ఒక చోట వుండాలంటే కొన్ని ఇబ్బందులు తప్పవుకదా. 

సాయంకాలం టిఫెన్లంటే ఇడ్లీ, వడా వూహించుకోకండి.  మా సత్రంలో ఇంచక్కా రోజుకోరకం ఉప్మా పెట్టాడు.  రెండు రోజులు తినేసరికి ఎక్కడ ఏమున్నాయా అని వెతుక్కోవటం మొదలు పెట్టాం.  కిందనే అయ్యర్స్ హోటల్ లో ఊతప్పం, ఇడ్లీ, వడ, దోశ దొరికాయి.  పొద్దున్న రోడ్డు పక్కన వేడి వేడి ఇడ్లీ, దోశ తిన్నాము.  కాఫీ, టీలకు లోటు లేదు.  మంచి పాలు కూడా దొరుకుతాయి.  ఇంచక్కా కొంచెం మీగడ వేసి చిక్కని లస్సీ దొరుకుతుంది.  స్వీట్స్ కోవాతో చేసినవి బాగుంటాయి.  గులాబ్ జామ్, జిలేబీ మనదగ్గరకన్నా అక్కడ రుచి ఎక్కువ.  భోజన ప్రియులూ, ఆహారం గురించి కంగారు పడకండి.  ఎటొచ్చీ యాత్రా స్ధలాల్లో తినటం అలవాటు చేసుకోవాలి.

సరే కాశీ చేరాము.....రూమ్ దొరికింది.  ఇంక కాలు నిలవలేదు.  గబగబా తయారయి గంగ హారతికి బయల్దేరాము.

ఈ పోస్టులో మనిషి మఖ్యావసరమైన ఆహారం, కాశీలో దొరికేదాని గురించి తెలుసుకున్నాముకదా.  వచ్చే పోస్టులో కాశీలో రోడ్లతోపాటు గంగ హారతి విశేషాలు.

 కాశీ విశ్వనాధుని ఆలయ ప్రవేశ ద్వారం (దీని వెనకాలే ఆలయం వుందనుకోకండి..దీని లోపల ఇరుకు రోడ్లల్లో దాదాపు రెండు ఫర్లాంగులు నడిస్తే వస్తుంది....సెక్యూరిటీ చెక్)
 మేము దిగిన సత్రంలో వున్న విశ్వనాధ, అన్నపూర్ణ విగ్రహాలు.  విశ్వనాధునికి ఇవతల సాయిబాబా కూడా వున్నాడు.

 శ్రీ సాయి విశ్వనాధ అన్నపూర్ణ సేవా సమితి వారి సత్రంలో భోజనాల హడావిడి