Saturday, April 9, 2011

శ్రీ రాజరాజేశ్వరీ దేవాలయం, వరంగల్


యమ్.జి.యమ్. ఆసుపత్రి సమీపంలోవున్న ఈ అతి చిన్న ఆలయం వెనుక ఒక కధ వున్నది. పూర్వం ఇదంతా అడవి. లోగేశ్వరమ్మ అనే బాల వితంతువు ఇక్కడ ఒక గుడిసె వేసుకుని దేవతా విగ్రహాలను పెట్టుకుని, భగవన్నామస్మరణ చేస్తూ వుండేది. అప్పుడు ఇక్కడికి అనేక సర్పాలు, నాగుపాములతో సహా వచ్చేవి. లోగేశ్వరమ్మ పోసిన పాలు తాగి పోయేవి. అవి ఎంత అలవాటయినాయంటే ఎప్పుడన్నా అవి రాకపోతే లోగేశ్వరమ్మ పిలిస్తే వచ్చేవి. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఊరి పెద్దలు కొందరు అక్కడ సత్యన్నారాయణ విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకున్నారు. ఏవో కారణాలవల్ల కుదరలేదు.

శ్రీ భద్రకాళి జన్నయ్య శాస్త్రి శిధిలావస్ధలోవున్న దేవాలయ పునరుధ్ధురణకోసం చేసిన కృషి వలన ధర్మారం జమీందార్లు ఇక్కడ ఒక చిన్న గది వేసి ఆలయ నిర్వహణకు 5 ఎకరాల భూమి ఇచ్చారు. అప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నాగు పడగ, శివలింగం మాత్రమే వుండేవి. ఆలయం సుబ్రహ్మణ్య ఆలయమని పేరుపొందింది. శ్రీ గణేశ శాస్త్రిగారనే విద్వాంసుడు ఇక్కడ కొన్నాళ్ళు అనుష్టానం చేసుకున్నారు. ఆయన ఇక్కడ శ్రీ రాజేశ్వరీ అమ్మవారిని ప్రతిష్టించాలని, అమ్మవారి విగ్రహంకోసం ఆయనా, జమీందారూ రెండుసార్లు జయపూర్ వెళ్ళారుకానీ సరైన అమ్మవారి విగ్రహం కనబడలేదు. మూడోసారి వెళ్ళినప్పుడు ముందు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం కనబడింది. అప్పుడు వారు అంతకుముందునుంచీ అది సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంకదా..దానిలో అమ్మవారిని ప్రతిష్టించాలనుకునేసరికి అమ్మవారి విగ్రహంకూడా దొరకటంలేదని అనుకుని, ఆ ఆలయంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం కూడా స్ధాపిస్తామని దణ్ణం పెట్టుకున్నారుట. వెంటనే వారికి కావలసిన అమ్మవారి విగ్రహంకూడా కనబడి ఆ రెండు విగ్రహాలనూ తీసుకొచ్చి పక్కపక్కనే ప్రతిష్టించారు. ఇక్కడ రాజేశ్వరీ అమ్మవారి విగ్రహం పక్కనే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం వుంటుంది.

నిత్య పూజలతోపాటు వినాయక నవరాత్రులు, శరన్నవరాత్రులూ, సుబ్రహ్మణ్య షష్టికి 3 రోజుల ఉత్సవాలు వగైరా ఘనంగా జరుపుతున్నారు ఈ ఆలయంలో.

ఇప్పటికీ ఆలయంలోకి అప్పుడప్పుడూ పాము వస్తూవుంటుంది.

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, రామన్నపేట, వరంగల్



రద్దీగా వుండే మైన్ బజారులో వున్న ఈ ఆలయానికి భక్తుల తాకిడీ ఎక్కువే. ముఖ్యంగా పర్వదినాలూ, శనివారాలూ. స్వామి వెండి కవచం అలంకరణలో అద్భుతంగా దర్శనమిస్తాడు.