Wednesday, March 28, 2012

ఆంజనేయస్వామి ఆలయం, కెన్గల్




<!--[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE X-NONE

ఆంజనేయస్వామి ఆలయం, కెన్గల్

ఉదయం 8-15కి రామనగర్ లోని రామాలయంనుంచి బయల్దేరి 8-45కి నేషనల్ హైవే 17 మీద కుడివైపువున్న ఒక ఆలయంలో జనం ఎక్కువ కనబడితే వెళ్ళాము. వెళ్ళాక తెలుసుకున్నాము అది చెన్నపట్టణం తాలూకాలోని కెన్గల్ అనే వూరిలోని ఆంజనేయస్వామి ఆలయం అని. ఈ ఆలయం 40 సంవత్సరాలక్రితం నిర్మింపబడింది. ఆలయం ఆకారంకూడా మన ఆలయాలకి భిన్నంగా వున్నది. ఆలయం చిన్నదే అయినా చుట్టూ ఖాళీస్ధలం చాలావున్నది.

మేము వెళ్ళేసరికి అప్పుడే అభిషేకం పూర్తయ్యి స్వామిని అలంకరిస్తున్నారు. తెరలు వేసివున్నాయి. ఎంతసేపు పడుతుంది, మేమింకా చాలా ప్రదేశాలకి వెళ్ళాలని అంటే అక్కడి పూజారులు ఒక్క నిముషం తెర తొలిగించి స్వామి దర్శనం చేసుకోనిచ్చారు. అక్కడ స్వామిని పసుపుతో అలంకరిస్తున్నారు. స్వామిని అభిషేకించిన పసుపు, చాలా మంచిది తీసుకోమని ఇచ్చారు. మేము చూసినప్పుడు ముఖానికి పసుపు అలంకరిస్తున్నారు. చాలా బాగుంది. అయితే రోజూ అలా అలంకరిస్తారో, లేక ఆరోజేమైనా ప్రత్యేకత వున్నదో, ఇంకా గుడి విశేషాలు, వాళ్ళు కొన్ని చెప్పినా, తెలుసుకోలేకపోయాను భాష తెలియకపోవటంవల్ల. తెలిసినవారు తెలియజేస్తే సంతోషం.

9 గం. లకి మళ్ళీ బయల్దేరాము.

Monday, March 26, 2012

రామదేవర బెట్ట, రామనగర్




రామదేవర బెట్ట, రామనగర్

కర్ణాటకాలో మేము చూసిన ఆలయాల గురించి చెప్తానన్నానుకదా. మేము కర్ణాటకాలో వున్న మూడు రోజులలో మొదటి రోజు బెంగుళూరులో చూసిన మూడు ఆలయాల గురించి చెప్పాను. రెండవ రోజు ఉదయం 6-30కి టాక్సీలో బయల్దేరి మర్నాడు రాత్రి 9-30 దాకా చూసిన ఆలయాలగురించి చెప్తాను. మేము వెళ్ళింది టాక్సీలోగనుక రైలు, బస్సు మార్గాలు ఇవ్వటంలేదు. ఈ ఊళ్ళన్నింటికీ బస్సు సౌకర్యం వున్నది.

ఉదయం 6-30 కి బెంగుళూరునుంచి మైసూరు వైళ్ళే దోవలో బయల్దేరాము. దోవలో ఫలహారాలయిన తర్వాత మేము ఆగిన మొదటి ప్రదేశం రామనగర్. ఇది బెంగుళూరు, మైసూరు రోడ్డులో వున్నది. ఇక్కడ రామ దేవర బెట్ట అనే కొండమీద రామాలయం ప్రసిధ్ధి చెందినది. మేమీ ఆలయం చేరేసరికి ఉదయం 8 గంటలయింది. చాలా మెట్లు వున్నాయి. కొన్ని ఎక్కాముగానీ ఎక్కడా ఆలయం కనిపించలేదు. అక్కడ ఎవరినన్నా అడుగుదామంటే ఎవరూ కనబడలేదు. సమయం తక్కువ వుండటంతో, తీరా మెట్లన్నీ ఎక్కాక పైన గుడి తీసిలేకపోతే అనే అనుమానంతో వెనుదిరిగాము. ఆ మెట్లు, మెట్ల మొదట్లో గోడమీద చెక్కిన ఆంజనేయస్వామి ఫోటో చూడండి.

ఈ ఆలయం గురించి ఎవరికైనా తెలిస్తే వివరాలు తెలియజేస్తే అందరికీ ఉపయోగపడతాయి.

Tuesday, March 20, 2012

ధైర్య సాహసాలనిచ్చే నందవరం వీర చౌడేశ్వరీదేవి






(భక్తిసుధ, మార్చి 2012 సంచికలో ప్రచురించబడింది)

ధైర్య సాహసాలనిచ్చే నందవరం వీర చౌడేశ్వరీదేవి


భక్తుల మనసులో పిరికితనాన్ని పోగొట్టి ధైర్య సాహసాలిచ్చే వీర చౌడేశ్వరీదేవి విన్నారా? తనను కొలిచే కొందరు బ్రాహ్మణుల కోసం సాక్ష్యం చెప్పటానికి ఈ దేవి కాశీనుంచి సొరంగమార్గాన కదిలివచ్చి ఇక్కడ కొలువైనదంటారు. ఆ ప్రదేశమే కర్నూలు జిల్లాలోని నందవరం. ఈ ఊరు కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి 20 కి.మీ. ల దూరంలో, పాణ్యం – బనగానపల్లె రోడ్డులో వున్నది. అతి పురాతనమైన ఈ ఆలయం నిర్మాణకాలం తెలియదని కొందరంటే 4 వేల సంవత్సరాల క్రితం నిర్మింపబడిందని కొందరంటారు. సమయం ఎప్పుడైనా, ఈ దేవి కాశీనుంచి సాక్ష్యం చెప్పటానికి వచ్చి ఇక్కడ వెలసిందని అందరూ అంటారు. ఆ కధేమిటంటే….

పూర్వం చంద్రవంశీయ రాజైన నంద భూపాలుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూవుండేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో వుండేవాళ్ళు. నందభూపాలుడికి దైవభక్తి కూడా మెండు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీ దత్తాత్రేయస్వామి రోజూ కాశీవెళ్ళి గంగలో స్నానం చెయ్యాలనే ఆయన కోర్కెను తీర్చటానికి పావుకోళ్ళను ప్రసాదించాడు. అయితే ఆ విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వుంచమంటాడు. ఆ రాజు, రోజూ తెల్లవారుఝామునే ఆ పావుకోళ్ళు ధరించి మనోవేగంతో కాశీచేరి గంగలో స్నానమాచరించి, విశ్వనాధుణ్ణి, విశాలాక్షిని, అన్నపూర్ణని దర్శించి తిరిగి తెల్లవారేసరికి తన రాజ్యం చేరుకునేవాడు.

కొంతకాలం ఇలా గడిచాక, నందభూపాలుడి భార్య శశిరేఖ తన భర్త రోజూ తెల్లవారుఝామునే ఎక్కడికో వెళ్ళివస్తూండటం గమనించి భర్తను అడుగుతుంది. తప్పనిసరి పరిస్ధితుల్లో శశిరేఖకు విషయం చెప్తాడు నందభూపాలుడు. ఆవిడ తనని కూడా కాశీ తీసుకువెళ్ళమని కోరుతుంది. ఆవిడ మాట కాదనలేక రాజు ఆ రోజు ఆవిడనికూడా కాశీ తీసుకువెళ్తాడు. తిరిగివచ్చు సమయానికి పావుకోళ్ళు పనిచేయవు. కారణం రాణీ శశిరేఖ బహిష్టుకావటం. తన రాజ్యానికి సత్వరం చేరకపోతే రాజ్యం అల్లకల్లోలమవుతుందనే భయంతో దిక్కుతోచని రాజు ఆ సమీపంలోనేవున్న ఆలయందగ్గరవున్న బ్రాహ్మణులనుచూసి వారిని తరుణోపాయం చూపించమని వేడుకుంటాడు.

అందులో ఋగ్వేద పండితుడయిన ఒక బ్రాహ్మణుడు రాజుకి సహాయంచెయ్యటానికి సంసిధ్ధతను తెలియజేస్తాడు. ఆయన తనతోటి వారిని ఇంకో 500 మంది పండితులనుకలుపుకుని, దోషనివారణార్ధం జపతపాలుచేసి, తమ తపోశక్తి వారికి ధారపోసి వారిని వారి రాజ్యానికి చేరుస్తారు. ప్రత్యుపకారంగా రాజు వారికేసహాయంకావాల్సివచ్చినా తప్పక చేస్తానని, వారు నిస్సంకోచంగా కోరవచ్చునని అనగా, ఆ బ్రాహ్మణులు భవిష్యత్ లో అవసరమైనప్పుడు తప్పక కోరుతామంటారు. రాజూ, రాణీ తమ రాజ్యానికి చేరుకున్నారు. ఆ పాదుకలను, మంత్ర శక్తిని తిరిగి వాడకుండా దత్తాత్రేయ మందిరంలో వుంచి, తమ రాజ్యంలో సుఖంగా వుండసాగారు.

కొంతకాలం తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువురాగా, నందభూపాలుని సహాయమర్ధించటానికి ఆ బ్రాహ్మణులలో కొందరు బయల్దేరుతారు. వారు నందవరంచేరి, రాజసభకువచ్చి తమరాకకి కారణం చెబుతారు. రాజుకి అంతా తెలిసినా, తన తోటివారికి తెలియదుకనుక, వారికికూడా తెలియజేసే ఉద్దేశ్యంతో తానిచ్చిన వాగ్దానానికి ఋజువేమిటని అడుగుతాడు. బ్రాహ్మణులు రాజు వాగ్దానము చేసింది నిత్యం తాము కొలిచే చాముండేశ్వరీదేవి గుడి ముందు, ఆవిడ తప్ప వేరే సాక్ష్యంలేదనీ, ఆవిడనే నమ్ముకున్న తాము సాక్ష్యమిమ్మని ఆవిడని బతిమాలుతామంటారు. రాజు ఆ దేవదేవి తన రాజ్యానికి వస్తుందని లోలోన సంతోషించి అంగీకరిస్తాడు.

వచ్చిన బ్రాహ్మణులలో కొందరు తిరిగి కాశీ వెళ్ళి తమ ఇష్టదైవం చాముండేశ్వరీదేవిని పరిపరివిధాల ప్రార్ధించి, సాక్ష్యం చెప్పటానికి రావలసినదిగా కోరుతారు. ఆ దేవి అలాగే వస్తానని, వారిని ముందు బయల్దేరమని, తేజోరూపంలో తను వారి వెనుకనే వస్తానని, అయితే దోవలో ఎక్కడా వెనుదిరిగి చూడవద్దని చెబుతుంది. మునుపు రాజుకి సహాయంచేసిన మిగతా 500మంది బ్రాహ్మణులనికూడా నందవరం రమ్మని చెబుతుంది. అందరూ సొరంగ మార్గాన నందవరానికి బయల్దేరుతారు. నందవరం చేరుతుండగా అందులో ఒక బ్రాహ్మణునికి అనుమానం వస్తుంది. తమ వెనుక ఏమీ అలికిడి కావటంలేదు, అమ్మవారు తమతో వస్తోందో రావటంలేదోనని సందేహంతో వెనుదిరిగి చూస్తాడు. అక్కడదాకా వచ్చిన అమ్మవారు వెంటనే శిలారూపందాలుస్తుంది. చింతిల్లితున్న బ్రాహ్మణులతో ఆమె చౌడేశ్వరీదేవిగా తానక్కడే కొలువైవుండి భక్తులను సంరక్షిస్తూ వుంటానని తెలుపుతుంది.

నందభూపాలుడు కాశీనుంచి వచ్చిన ఆ దేవత తమ రాజ్యంలో వెలిసినదని సంతోషంతో గుడి కట్టించి, పూజలుసల్పసాగాడు. అమ్మవారితో కాశీనుంచి కదిలివచ్చిన 500మంది బ్రాహ్మణులు, అమ్మవారి ఆజ్ఞమేరకు అక్కడే వుండి తమ కులదైవమైన ఆ దేవిని పూజించుకోసాగారు. ఆ బ్రాహ్మణ కుటుంబాలను నందవరీకులంటారు. వారు ఇప్పటికీ చౌడేశ్వరీదేవిని తమ కులదేవతగా పూజిస్తారు. ఆ కుటుంబీకులు గర్భగుడిలోకెళ్ళి స్వయంగా దేవిని పూజించుకోవచ్చు. కాశీనుంచి బ్రాహ్మణులు, అమ్మవారు వచ్చిన సొరంగమార్గం ఇంకా వుందంటారు. కానీ అందులోకి ప్రవేశం లేదు. నందవరీక బ్రాహ్మణులకేకాక తొగట వీర క్షత్రియలకుకూడా చౌడేశ్వరీదేవి కులదేవత.

అమ్మవారు ముందు చాలా ఉగ్రరూపంలో వుండేది. ఆ రూపాన్ని ప్రజలు చూడలేకపోయేవారు. భక్తుల సౌకర్యార్ధం, వారా తల్లి ఉగ్రరూపంచూడలేరని ఆ దేవి విగ్రహంలాంటిదే ఇంకొకటి తయారుచేయించి ప్రతిష్టించారు. అయితే ఈ విగ్రహం అసలు విగ్రహమంత భయంకరంగా వుండదు. అసలు విగ్రహం ఇప్పుడు అమ్మవారువున్న స్ధానానికి సరిగ్గా దిగువ భూగర్భంలో వున్నది. అక్కడికి వెళ్ళే మార్గం వున్నదికానీ ఎవరికీ ప్రవేశంలేదు.

ఆలయం ముందు సొరంగ మార్గం వున్నది. పది మెట్లు దిగి వెళ్తే అక్కడ అమ్మవారి పాదాలు వున్నాయి. ఆ మార్గంనుంచే అమ్మవారు, మిగతా బ్రాహ్మణులు, కాశీనుంచి ఇక్కడికి వచ్చారంటారు.

అమ్మవారు వీర చౌడేశ్వరీదేవి. వీరత్వానికి తగ్గట్లే రూపం వుంటుంది. ఈ తల్లిని సేవించినవారికి అన్నిరకాల భయాందోళనలు దూరమయి ధైర్యసాహసాలతో విలసిల్లుతారని ప్రతీతి. ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలచిన ఆ దేవి తోజోవంతమైన రూపం చూసినవారి మనసులోని అన్ని భయాందోళనలూ పటాపంచలవుతాయి. ధైర్యసాహసాలేకాదు సకల సౌభాగ్యాలూ ప్రసాదించే తల్లి అన్నదానికి సంకేతమా అన్నట్లు అమ్మవారి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కుంకుమ భరణె వుంటాయి.

ఆలయం ప్రక్కనే ఒక చెట్టు వున్నది. విశాలంగా విస్తరించిన ఈ వృక్షం ఆకులు మన గోరింట చెట్టు ఆకులులాగా ఇంకా చిన్నగా వుంటాయి. చిన్న చిన్న తెల్ల పూలతో ఆకర్షణీయంగా వుండే ఈ చెట్టు కరివె. ఈ వృక్షం కూడా అమ్మవారితోబాటు కాశీనుంచి తరలివచ్చిందని భక్తుల విశ్వాసం. అందుకే అచంచల భక్తితో భక్తులు ఈ వృక్షనికి కూడా పూజలు చేస్తారు.

అమ్మవారిముందు శ్రీ చక్రం వున్నది. భక్తులు అక్కడ కుంకుమ పూజ చేయవచ్చు.


Saturday, March 10, 2012

గవి గంగాధరేశ్వర ఆలయం, బెంగుళూరు

ఆలయం వెలుపలనుంచి (ఎడమవైపు త్రిశూలం, సూర్యపాన కూడా కనబడుతున్నాయి)

ఆలయం లోపలి దృశ్యం (ఎడమవైపునుంచి ప్రదక్షిణ మార్గం..వంగుని వెళ్ళాలి)
గర్భగుడిలో శివలింగం

దుర్గాదేవి

ఆలయంలోపల దృశ్యం
గర్భగుడి చుట్టూవున్న ప్రదక్షిణ మార్గం



గవి గంగాధరేశ్వర ఆలయం, బెంగుళూరు

బెంగుళూరులోని గవిపురంలో వున్న ఈ ప్రఖ్యాత ఆలయం, భారతదేశంలో అతి పురాతనమైన గుహాలయాలలో (cave temples) ఒకటి. పూర్వం గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటూ, ఇక్కడి శివలింగాన్ని త్రికాలాలలో పూజించేవాడుట. అందుకే ఈ క్షేత్రాన్ని గౌతమ క్షేత్రమని కూడా అంటారు. భరద్వాజ మహర్షికూడా ఇక్కడ తపస్సుచేసుకున్నారు. గర్భగుడి చుట్టూవున్న ప్రదక్షిణ మార్గంలో మిగతా దేవతల సుందర విగ్రహాలతోపాటు ఈ మహర్షులిద్దరి విగ్రహాలుకూడా వున్నాయి.

ఈ గుహాలయం బయటగల మంటపం 14 స్తంబాలతో, విజయనగర నిర్మాణ శైలిలో వున్నది. ఈ హాలు, బయట సూర్యపాన, చంద్రపాన (ఒక స్తంబానిక పైన పెద్ద వృత్తంలా వుంటుంది..సూర్య, చంద్రులకు ప్రతీకగా వీటిని చెబుతారు), త్రిశూలం వగైరాలన్నీ బెంగుళూరు నిర్మాత కెంపెగౌడ సమయంలో నిర్మింపబడ్డాయి.

ఈ ఆలయంలో ప్రదక్షిణ మార్గాలు రెండు వున్నాయి. శివ లింగానికి కుడి వైపున దుర్గ, పార్వతులకి విడి విడిగా ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలని కలుపుతూ దుర్గ ఉపాలయం పక్కనుంచీ ఒక ప్రదక్షిణ మార్గం వుంది. ఈ మార్గంలో వంగుని మాత్రమే వెళ్ళగలం. గర్భగుడి చుట్టూవున్న ఇంకొక ప్రదక్షిణ మార్గం నడవటానికి వీలుగా వుంటుంది. ఈ రెండు ప్రదక్షిణ మార్గాలలో అనేక సుందర దేవతా ప్రతిమలు వున్నాయి.

ఇక్కడ గర్భాలయంలో శివుని దగ్గరనుంచి పలుచని నీటి ప్రవాహం నిరంతరం వుంటుంది. అందుకనే ఇక్కడి శివుడు గంగాధరేశ్వరుడయ్యాడు. ఈ గుహలోంచి రెండు సొరంగ మార్గలున్నాయి. అవి ఒకటి కాశీకి, రెండవది కర్ణాటకలోని శివగంగకువెళ్తాయంటారు.

ఇక్కడ ఇంకొక విశేషం ప్రతి సంవత్సరం మకర సంక్రాంత్రి రోజున సూర్యకిరణాలు ఆలయం బయటవున్న నంది కొమ్ముల మధ్యనుంచి శివలింగాన్ని తాకుతాయి. ఈ అపూర్వ దృశ్యం వీక్షించటానికి భక్తులు వేల సంఖ్యలో హాజరవుతారు.

ఈ ఆలయాన్ని చూడని బెంగుళూరువాసులూ, వీలుచేసుకుని తప్పక దర్శించండి. ఇదేమిటండీ, ప్రఖ్యాత ప్రాచీన ఆలయమంటున్నారు, దీనిని చూడని బెంగుళూరు వాస్తవ్యులుంటారా అని అడగకండి. మేము వెళ్ళిన పెళ్ళిలో బెంగుళూరు వాస్తవ్యులు కొందరికి ఈ ఆలయంగురించి మేము చెప్పివచ్చాము.