Monday, August 6, 2012

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, తొండనూరు.



శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, తొండనూరు.

తొండనూరులో శ్రీ నంబి నారాయణస్వామి ఆలయానికి అతి సమీపంలోనే వున్నది శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం.  ఇక్కడ మూల విరాట్ భూదేవీ, నీలా దేవీ సమేతుడైన శ్రీ పార్ధసారధి  చతుర్భుజుడు….ఒక చేత్తో భక్తులకు అభయప్రదానం చేస్తుండగా, వేరొక చేయి తొడపై ఆని వుంటుంది.  మరి రెండు చేతులలో శంఖం, చక్రం దాల్చి అపురూప సౌందర్యంతో అలరారుతుంటాడు.

ఉత్సవ విగ్రహాలు శ్రీ దేవి, భూ దేవి సమేత శ్రీ వేణు గోపాల స్వామి.  ఈయన శాస్త్రీయ నాట్యంలోని త్రి భంగిమలో వున్నారు.  వేణు గోపాలస్వామి ఎక్కడ చూసినా కుడి కాలు ముందుకి మెలి వేసి వుండగా, ఎడమ కాలు వెనుక వుంటుంది.  కానీ ఇక్కడ స్వామి ఎడమ కాలు ముందు వుంటుంది.

ఈ స్వామిని ద్వాపర యుగంలో యుధిష్టరుడు ప్రతిష్టించాడంటారు.  ఆలయం చుట్టూ విశాలమైన ఆవరణ ఆకర్షణీయంగా వుంటుంది.